Numbers 35

1యెరికో దగ్గర యొర్దానుకు సమీపంలోని మోయాబు మైదానాల్లో యెహోవాాా మోషేకు ఈ విధంగా చెప్పాడు. 2<<తాము పొందే వారసత్వాల్లో లేవీయులు నివసించడానికి వారికి పట్టణాలను ఇవ్వాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలను కూడా లేవీయులకు ఇవ్వాలి.

3అవి వారి నివాసానికి వారి పట్టణాలవుతాయి. వాటి పొలాలు వారి పశువులకు, మందలకు, వారి ఆలమందలకు ఉండాలి. 4మీరు లేవీయులకిచ్చే పట్టణాల గోడ మొదలుకొని చుట్టూ వెయ్యి మూరలు,

5ఆ పట్టణాల బయట నుండి తూర్పున రెండు వేల మూరలు, దక్షిణాన రెండు వేల మూరలు, పడమర రెండు వేల మూరలు, ఉత్తరాన రెండు వేల మూరలు కొలవాలి. ఆ మధ్యలో పట్టణాలుండాలి. అవి వారి పట్టణాలకు పల్లెలుగా ఉంటాయి.

6మీరు లేవీయులకు ఇచ్చే పట్టణాల్లో ఆరు ఆశ్రయపురాలుండాలి. హత్య చేసినవాడు వాటిలోకి పారిపోగలిగేందుకు వీలుగా వాటిని నియమించాలి. అవి గాక 42 పట్టణాలను కూడా ఇవ్వాలి. 7వాటి పల్లెలతో కలిపి మీరు లేవీయులకు ఇవ్వాల్సిన పట్టణాలన్నీ నలభై ఎనిమిది.

8మీరిచ్చే పట్టణాలు ఇశ్రాయేలీయుల వారసత్వంలో నుండే ఇవ్వాలి. ఎక్కువ భూమి ఉన్నవారు ఎక్కువగా, తక్కువ భూమి ఉన్నవారు తక్కువగా ఇవ్వాలి. ప్రతి గోత్రం తాను పొందే వారసత్వం ప్రకారం తన తన పట్టణాల్లో కొన్నిటిని లేవీయులకు ఇవ్వాలి.>>

9యెహోవాాా ఇంకా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. <<నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు, 10మీరు యొర్దాను దాటి కనాను దేశంలోకి వెళ్లిన తరవాత 11ఆశ్రయపురాలుగా ఉండటానికి పట్టణాలను ఎన్నిక చేయాలి.

12పొరబాటున ఎవరినైనా చంపినవాడు వాటిలోకి పారిపోవచ్చు. తీర్పు కోసం నరహంతకుడు సమాజం ఎదుట నిలిచే వరకూ వాడు మరణశిక్ష పొందకూడదు కాబట్టి ప్రతికారం తీర్చుకునేవాడి నుండి అవి మీకు ఆశ్రయం కల్పిస్తాయి. 13మీరు ఆరు పట్టణాలను ఆశ్రయ పురాలుగా ఇవ్వాలి.

14వాటిలో యొర్దాను ఇవతల మూడు పట్టణాలు, కనాను దేశంలో మూడు పట్టణాలు ఇవ్వాలి. అవి మీకు ఆశ్రయపురాలుగా ఉంటాయి.

15ఎవరినైనా పొరబాటున చంపిన వాడు వాటిలోకి పారిపోయేలా ఆ ఆరు పట్టణాలు ఇశ్రాయేలీయులకు, పరదేశులకు, మీ మధ్య నివసించే ఎవరికైనా ఆశ్రయంగా ఉంటాయి.

16ఒకడు చనిపోయేలా ఇనుప ఆయుధంతో కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి. 17ఒకడు చనిపోయేలా రాతితో కొట్టినప్పుడు ఆ కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి. 18అలాగే ఒకడు చనిపోయేలా మరొకడు చేతి కర్రతో కొడితే కొట్టినవాడు నరహంతకుడు. వాడు తప్పకుండా మరణశిక్ష పొందాలి.

19హత్య విషయంలో ప్రతికారం తీర్చుకునే వాడు తానే స్వయంగా ఆ నరహంతకుణ్ణి చంపాలి. వాణ్ణి కలిసినప్పుడు చంపవచ్చు. 20ఎవరైనా చనిపోయేలా పగపట్టి పొడిచినా, లేక పొంచి ఉండి వాడి మీద దేనినైనా విసిరినా, లేక వైరంతో చేతితో కొట్టినా, కొట్టినవాడు నరహంతకుడు. అతణ్ణి తప్పకుండా చంపాలి. 21ప్రతికారం తీర్చుకునేవాడు ఆ నరహంతకుణ్ణి కలిసినప్పుడు వాడిని చంపవచ్చు.

22అయితే పగ ఏమీ లేకుండా వాడిని పొడిచినా, పొంచి ఉండకుండాా వాడిమీద ఏ ఆయుధమైనా విసిరినా ఒకడు చనిపోయేలా వాడిమీద రాయి విసిరినా, 23దెబ్బతిన్న వాడు చనిపోతే ఆ కొట్టినవాడు వాడి మీద పగపట్ట లేదు, వాడికి హాని చేసే ఉద్దేశం లేదు.

24కాబట్టి సమాజం ఈ నియమాల ప్రకారం కొట్టిన వాడికీ ప్రతికారం తీర్చుకునే వాడికీ మధ్య తీర్పుతీర్చాలి. 25ఆ విధంగా చేసి సమాజం నరహత్య విషయంలో ప్రతికారం తీర్చుకునే వాడి చేతి నుండి ఆ నరహంతకుణ్ణి కాపాడాలి. సమాజం మొదట పారిపోయిన ఆశ్రయపురానికి వాణ్ణి మళ్ళీ పంపించాలి. వాడు పవిత్ర తైలంతో అభిషేకం పొందిన ప్రధాన యాజకుడు చనిపోయే వరకూ అక్కడే నివసించాలి.

26అయితే అతడు ఎప్పుడైనా తన ఆశ్రయపురం సరిహద్దు దాటి వెళితే 27నరహత్య విషయంలో ప్రతికారం తీర్చుకునేవాడు ఆశ్రయపురం సరిహద్దు బయట అతణ్ణి చూసి చంపినప్పటికీ వాడి మీద హత్యాదోషం ఉండదు. 28ఎందుకంటే, ప్రధాన యాజకుడు చనిపోయే వరకూ అతడు ఆశ్రయపురంలోనే నివసించాలి. ఆ ప్రధాన యాజకుడు చనిపోయిన తరువాత ఆ నరహంతకుడు తన వారసత్వం ఉన్న దేశానికి తిరిగి వెళ్లవచ్చు.

29ఇవి మీరు నివాసముండే స్థలాలన్నిటిలో అన్ని తరాలకు మీకు విధించిన కట్టడ. 30ఎవరైనా ఒకణ్ణి చంపితే సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకుడికి మరణశిక్ష విధించాలి. ఒక్క సాక్షిమాట మీద ఎవరికీ మరణశిక్ష విధించకూడదు.

31హత్యా దోషంతో చావుకు తగిన నరహంతకుని ప్రాణం కోసం మీరు విమోచన ధనాన్ని అంగీకరించక తప్పకుండా వాడికి మరణశిక్ష విధించాలి. 32ఆశ్రయపురానికి పారిపోయిన వాడు యాజకుడు చనిపోక ముందుగా తన స్వంత ఊరిలో నివసించేలా చేయడానికి వాడి దగ్గర విమోచన ధనాన్ని అంగీకరించ కూడదు.

33మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయకూడదు. నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. దేశంలో చిందిన రక్తం కోసం ప్రాయశ్చిత్తం ఆ చిందించిన వాడి రక్తం వల్లనే కలుగుతుంది గాని మరి దేనివల్లా జరగదు. కాబట్టి మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయవద్దు. ఎందుకంటే నేను దానిలో నివసిస్తున్నాను. నిజంగా యెహోవాాా అనే నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నాను.>>

34

Copyright information for TelULB